*కాఫీవిత్…ఆర్. రమాదేవి. 2125
*ఇతను ఎంతో పొదుపరి అన్నిటికంటే మాటల్లో…!!
*ఆ పొదుపరితో చిక్కటి చిక్కుముడిలా పాపం!
ఆమె రోజంతా అక్కడే చిక్కుకుపోతోంది.!,
సాధారణ వాడుకలో పొదుపు అంటే తమఆదాయంలో డబ్బును ఖర్చుపెట్టకుండాఅట్టేపెట్టుకోవడం.ఉదాహరణకు బీరువాలో దాచుకోవడం,బ్యాంకుఖాతాలో వేసుకోవడం వంటివి. ఆర్ధికశాస్త్రం పరిభాషలో ఆదాయంలో వినియోగం చేయగా మిగిలిందే పొదుపు...
మరింత విస్తృతమైన అర్ధంలో"పొదుపు"అంటేఖర్చును తగ్గించుకోవడం..అయితే ఇప్పుడు మనంచెప్పుకునే పొదుపు “మాటలకు” సంబంధించింది.అదీ..ప్రేమలో వున్నవారి మాటలు. ఆ వైనమేదో తెలుసు కోవాలంటే ఈ కాఫీటైమ్లో రమాదేవి కవితను చూడాలి.!!
అబ్బో
ఇతను ఎంతో పొదుపరి
అన్నిటికంటే మాటల్లో మరింత
ఇదేమి చిత్రమో
ఈమధ్య
పంచిన నాలుగు మాటలు
వెనక్కు తీసుకోవడమూ వచ్చింది..
విని వినిపించకుండా అంటాడా!!
ఏమిటంటూ వెనుదిరిగితే
ఏమీ లేదంటూ నవ్వుతూ దాటేస్తాడు
అన్నమాట వినిపించక
అన్నది ఏమిటో తెలియక
ఈ పొదుపరితో...
చిక్కటి చిక్కుముడిలా
అక్కడే ...... చిక్కుకుపోతాను రోజంతా
ఓయ్ ..
నిజం చెప్పు
ఇందులో తిరకాసు కథలేమి లేవు కదా”!!
ఆ ఇద్దరూ ప్రేమికులు..ప్రేమ భాషలో మాట్లాడుకుంటారు..గంటలు గంటలు మాట్లాడుకునేవారు.. అది
ఒకప్పటిమాట.ఈ మధ్య అతగాడెందుకో సరిగా…మాట్లాడటంలేదు.మాటల్లో పొదుపు పాటిస్తున్నాడు.
నిన్నమొన్నటిదాకా గల గల మాట్లాడిన అతగాడు ఇప్పుడెందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు.ఆచి తూచి పొదుపుగా మాట్లాడుతున్నాడు ఆమెకేం అర్ధంకావడంలేదు.అంతా చిత్రంగావుంది ఈమధ్య పంచిన నాలుగు మాటలు వెనక్కు తీసుకోవడందాకా వచ్చాడంటే ఇందులో మతలబు ఏమిటి?
అదేంటోగానీ…
వినీ వినిపించకుండా మాట్లాడుతుంటాడు..ఏం మాట్లాడుతున్నాడని వెనుదిరిగితే..ఏమీ లేదంటూ నవ్వుతూ దాటేస్తున్నాడు..అతగాడు అన్నమాట వినిపించక..అన్నదేమిటో తెలియక.. ఈ మాటల పొదుపరితో...మదుపరితో చిక్కటి చిక్కుముడిలా పాపం ఆమె రోజంతా అక్కడే చిక్కుకుపోతోంది.
ఏమిటో…
అసలేం జరుగుతోందో తెలియక ఆమె అతగాడ్ని నిలదీసింది..
ఓయ్…! నిజం చెప్పు ఇందులో తిరకాసు కథలేమి లేవు కదా”! అని..
అతగాడు సమాధానం ఇవ్వలేదు.. మౌనం అర్ధాంగీకారమా? ఆమె మనసులో నెలకొంది శంక..!!